Story on Failed love in Telugu Language : In this article read "విఫలమైన ప్రేమ కాశీ మజిలీ కథలు", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
Story on Failed love in Telugu Language : In this article read "విఫలమైన ప్రేమ కాశీ మజిలీ కథలు", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
విఫలమైన ప్రేమ కాశీ మజిలీ కథలు
గురువుగారు తన శిష్యులతో కలసి ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఒక పాడుబడిన పురాతనమందిరాన్ని చూసారు. చుట్టూ అడవి. మధ్యలో శిధిలావస్థలో నున్న పురాతన మందిరం. దానిని చూడగానే శిష్యులు "గురు వర్యా! అడవి మధ్యలో అంతఃపురంలాంటి మందిరమేమిటి? ఇంత అందమైన భవనము అడవిమధ్యలో నుండుటకు కారణమేమిటి? అని ప్రశ్నించారు.
గురువిట్లు చెప్పసాగాడు. “శిష్యులారా ! పూర్వము ఈ అడవికి ఉత్తరంగా ఒక రాజ్యముండేది. ఆ రాజుగారికి ముగ్గురు కుమారులుండేవారు. అందులో అందరికంటే చిన్నవాడైన రవివర్మకు వేటఅంటే మిక్కిలి ఇష్టము.
ఒకనాడు రవివర్మ అడవిలో వేటాడుతూ దారితప్పి ఒక గుహలోనికి ప్రవేశించాడు. లోపలంతా గాఢాంధకారం కన్నుపొడుచుకున్నా కానరాని కటిక చీకటి. ఏమిటీ గుహవిశేషం అనుకొని మరికొంతలోపలకు వెళ్ళిన రవివర్మకు! అకస్మాత్తుగా వెలుతురురావటం కనిపించింది. తనకెదురుగా వస్తున్న ఆ వెలుతురును గమనించిన రవివర్మ తనకళ్ళనుతానే నమ్మలేకపోయాడు. కాంతులీను తున్న ఆమె ఒక అద్భుత సౌందర్యరాశి ధగధగా మెరిసిపోతున్న ఆమెను రవివర్మ తదేకంగా చూడసాగాడు. ఆమె ఒక యక్షకన్య. ఆమె రవివర్మను చూడగానే “ఆహా! ఏమి అందం ! మానవులలో ఇంతటి అద్భుత సౌందర్యమా ! ఆహా ! ఈతడెంత అందముగా ఉన్నాడు. అనుకొని తన శృంగారచేష్టలతో రవివర్మను కవ్వించి, ఊరించి, తన మనస్సులోని, కోర్కెను తెలిపింది.
“సుందరాంగా ! నిన్నే మోహిస్తున్నాను. వరిస్తే నిన్నే వరిస్తాను. నా కోర్కెను కాదనకు అంటూవెంటబడింది. వలచివచ్చిన యక్షకన్యనుకాదనువారెవరు? రవి వర్మకూడా ఆమె అద్భుత రూపలావణ్యములకు లొంగి ఆమె ప్రేమలో పడ్డాడు. ఇరువురు మన్మధసుఖాలలో తేలియాడసాగారు. .
అంతకుమునుపే ఆ యక్షకన్యను వలచి, నిరాకరింపబడిన యక్షుడొకడు ఇదంతా గ్రహించాడు. రవివర్మ తన ప్రేమకు అడ్డంకిగా ఉన్నాడని తలంచి ఒకనాటి అర్ధరాత్రి ఒంటరిగానున్న రవివర్మను తనకరవాలంతో ఒక్కవేటున నరికి చంపివేసాడు.
రవివర్మకోసమే నిరీక్షిస్తున్న యక్షకన్య దూరం నుండి ఈ దృశ్యాన్ని చూసింది. హో! రాజకుమారా! వెళ్ళిపోతున్నావా? నా కోర్కెపూర్తిగా తీరకుండానే పోతున్నావే! అంటూ యక్షునికేసి తిరిగి" ఓరిదుర్మార్గుడా! నేనునీకు దక్కలేదనే కోపంతో నే వలచిన వరుడ్ని అంతమొందిస్తావా! నా ప్రియుడ్ని చంపినీకు నేనెలాదక్కుతా ననుకున్నా వురా! ఓరీదుష్టుడా! నా ప్రేమను భగ్నం చేసిన నీవు శిలమై పోదువు గాక ! అని శపించింది. మరుక్షణమే ఆ యక్షుడు శిలగా మారిపోయాడు.
మరల రాకుమారునివైపు తిరిగి ప్రియా ! నీవులేని జీవితం నా కెందుకు! నేను కూడా నీతోనే వస్తున్నాను. అంటూ ఆత్మహత్య చేసుకొని మరణించింది.
“నాయనలారా ! వారు విహరించిన మందిరమే ఇది. అదిగో !అక్కడ శిలా విగ్రహంగా నున్నవాడే ఆ యక్షుడు. తీరని కోరికతో బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న ఆ యక్షకన్య పిశాచమై ఇప్పటికీ ఆ మందిరంలో తిరుగుతున్నదని వినికిడి. ఎవ్వరూ సాహసించి ఆ గుహలోనికి వెళ్ళరు. వెళ్ళినవారు తిరిగివచ్చిన జాడలూ లేవు. అదీ ఈ మందిర విశేషం “అంటూ తన శిష్యులతో గురువుగారక్కడ నుండి మరల ప్రయాణమయ్యారు.
COMMENTS