Magical Flowers Kasi Majili Story in Telugu Language : In this article read మహిమాన్విత పుష్పల కథ, Kasi Majili Stories in Telugu for kids and Students.
Magical Flowers Kasi Majili Story in Telugu Language : In this article read "మహిమాన్విత పుష్పల కథ", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
మహిమాన్విత పుష్పల కథ Magical Flowers Story in Telugu
వృద్ధ బ్రాహ్మణుడు లేచి సభకునమస్కరించి చెప్పసాగాడు. “అయ్యా ! నేనొకనాడు నా పిల్లలతోసహా భుక్తికోసమై ప్రక్కగ్రామానికి పోతున్నాను. మిట్ట మధ్యాహ్నం ! ఎండతీవ్రంగా కాస్తున్నది. అలాపోతూఉన్న నాకు మార్గమధ్యంలో అద్భుత సౌందర్యరాశియైన స్త్రీ ఒక చెట్టునీడలో విశ్రాంతి తీసుకుంటుండగా చూసాను. ప్రక్కనే ఆమె గుర్రంకూడా కట్టివేయబడి ఉన్నది. అద్భుత సౌందర్యముతో మెరిసిపోతున్న ఆమెనాకొక దేవకన్యలా అనిపించింది. ఈ
ఆపసోపాలు పడుతూ, చెమటలు కక్కుతూ, అతిప్రయాసతో నా పిల్లలను వెంటబెట్టుకొనిపోతున్న నన్ను ఆ దివ్యకాంత చూసి “ఓ బ్రాహ్మణోత్తమా ! ఇంతటి తీవ్రఎండలో, మిట్టమధ్యాహ్నంవేళ పిల్లలతోసహా ఎక్కడికిపోతున్నారు. అలా దిగులుగానున్నారేమి ?” అని అడిగింది. అంతట నేను “అమ్మాయీ ! వీరంతా నాపిల్లలే ! నా భార్య జబ్బుతో మంచంపట్టి ఇటీవలే మరణించింది. ఇంతవరకూ భిక్షాటన చేసి కాలం గడుపుతున్నాను. కాని ప్రస్తుతము మా ప్రాంతంలో కరువు కాటకా లేర్పడి భిక్ష దొరకటం కష్టమౌతున్నది. ఈ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక దిగులుపడుతున్నాను. ప్రక్కఊరిలోనైనా భిక్ష దొరుకుతుందేమోనన్న ఆశతో ప్రక్క గ్రామానికిపోతున్నాను.” అనిచెప్పాను. అప్పుడదేవకన్యలాంటి స్త్రీ “ఓ బ్రాహ్మణుడా! నీ పరిస్థితి నన్ను కలచివేస్తున్నది. ఇదిగోనావద్ద ఒక అద్భుతపుష్పం ఉన్నది. తీసుకో ! ఇది ఎంతో మహిమగలపుష్పం. దీనిపరిమళం యోజనపర్యంతం (8 మైళ్ళు)విస్తరిస్తుంది. ఇది ఎన్నటికీ వాడనిపువ్వు. ఇంతటి మహిమాన్వితమైన పరిమళ పుష్పాన్ని చిరకాలం నీ కుటుంబాన్ని పోషించేవారికివ్వు. నీ దరిద్రము తీరిపోగలదు. సుఖంగా ఉండగలవు. అని చెప్పి పుష్పాన్నిచ్చితనగుర్రాన్నది రోహించి ఎటో వెళ్ళిపోయింది.
అద్భుత పుష్పంతో నేనలా పోయిపోయి సాయంకాలానికొక గ్రామంచేరాను. ఆ గ్రామంలో నాకొక ఇద్దరుమనుషులు ఎదురయ్యారు. వారునన్ను దాటుకుంటూ పోతూ " ఆహా! ఎంత బాగుందీ పరిమళ సువాసన. ఎక్కడినుండి వస్తున్నదోగదా! అరే !ఇక్కడే మీ పూలచెట్లుగాని, ఫలవృక్షములుగాని లేవే ! మరీ సువాసన ఎక్కడ నుండి వస్తోంది" అనుకుంటూ పరుగెత్తుకొని నా వద్దకు వచ్చారు. వారిలో ఒకడు ఓ బాపడా ! ఆగు ! నీ వద్ద పరిమళ సువాసన వెదజల్లేపువ్వు ఏదైనా ఉందా? నీవద్ద నుండి అద్భుతమైన పరిమళసుగంధవాసనవస్తోంది ! చెప్పు! అని అడిగాడు.
నేను వారితో అసత్యము చెప్పలేక “అవును బాబూ ! నా వద్ద యోజన దూరం తన పరిమళాన్ని వెదజల్లే పుష్పం ఉంది. అది ఎన్నటికీ వాడదు. నిత్యము తాజగా ఉంటుంది. ఉదయమే దీనిని నాకొక దేవకన్యలాంటి అప్సరస్త్రీ నా దీనస్థితికి జాలిపడి తనవద్దనున్నఈ పుష్పానిస్తూ బ్రాహ్మణుడా! నీ దరిద్రాన్ని పోగొట్టికలకాలం నిన్ను పోషించగల వారికి ఈ పుష్పాన్నియ్య నీ బాధలు, కష్టాలు అన్నీ సమసిపోతాయి. అనిచెప్పింది. కావునసామాన్యమానవులకెవ్వరికి ఈ పుష్పా న్నివ్వను.” అంటూ ముందుకు సాగిపోతున్న ఆ బ్రాహ్మణుని పట్టుకొని ఆ ఇద్దరు మనుష్యులు "అయ్యా! మిమ్ము, మీకుటుంబాన్ని పోషించగల తరగని ఆస్తి మాకుంది. మిమ్మల్ని పువ్వులో పెట్టి చూసుకుంటాం మీరాపుష్పాన్ని మాకివ్వరూ ! మీకే లోటు రానివ్వమన్నారు. పెద్దలసమక్షంలో వారితో ప్రమాణం చేయించుకొని పుష్పాన్ని ఆ ఇద్దరికీఇచ్చాను. వారిద్దరూ నన్నూ నాకుటుంబాన్ని తమ భవంతికి కొనిపోయారు. వారిద్దరూ స్నేహితులట పెద్ద ఆస్తిపరులే అయితే తెలిసిన విషయమేమంటే వారిద్దరికీ ఒక్కతే ఉంపుడుకత్తె ఉంది. ఒక్క వేశ్యవద్దకే ఇద్దరూ పోవటంవలన మిత్రులయ్యారట ఈ విషయం తెలిసిన నేను” అయ్యో ! ఇలాంటివారికా నేను పుష్పాన్నిచ్చింది” అని వాపోయాను. .
కొన్నిరోజులు బాగానే గడిచాయి. ఒకనాడేమయిందో ఏమోగాని వారిద్దరూ వాగ్వివాదానికిలోనై ఒకర్నొకరు చూసుకోవటం మానేసారు. మరికొంతకాలానికి వారిమధ్య వైషమ్యం తీవ్రస్థాయికి చేరింది. ఇదంతా వేశ్యవల్లనే అని గ్రహించటానికి నాకెంతోకాలం పట్టలేదు. ఒకనాడు మిత్రులిద్దరూ ఒకరికొకరు ఎదురపడి కొట్టాడు కుంటూ ఒకర్నొకరు కత్తులతో పొడుచుకొని మరణించారు. ఇద్దరూ చనిపోవటంతో మమ్మల్ని చూసేవారులేక మా కష్టాలు మరల మొదటికొచ్చాయి. పుష్పం ఉంటే నా బాధలు గట్టెక్కుతాయికదా ! యనుకొని పుష్పం గురించి ఆరాతీసాను. ఆ అద్భుత పుష్పం వేశ్యయింటికి చేరిందని గ్రహించాను. నెమ్మదిగా అమె ఇల్లు కనుక్కొని సంగతంతా వివరించి “నా పుష్పం నాకివ్వమని” అడిగాను.
అంతట ఆవేశ్య " ఓరి ! వెర్రి బ్రాహ్మణుడా ! వేశ్యలదగ్గరికి చేరిన సొత్తు ' మరల తిరిగి వస్తుందా ! లోకజ్ఞానం లేనివాడిలా ఉన్నావే ! వెళ్ళు ! వెళ్ళు ఆ పుష్పాన్ని నేనివ్వను” అని తెగేసి చెప్పింది.
ఇంక చేసేదిలేక గ్రామాధికారి వద్దకు పోయి సంగతంతా వివరించి నా పుష్పాన్ని నా కిప్పించండి” అని మొరపెట్టుకున్నాను. ఆ గ్రామాధికారికి కూడా ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో చంద్రవర్మ మహారాజుగారు ఇక్కడి సభకువస్తూ ఆ గ్రామంలో బస చేయటం జరిగింది. ఇదే మంచి అవకాశమనుకొని ఆయనను కలిసి నా గోడునంతా విన్నవించుకొన్నాను.
రాజులు తలచుకొంటే కానిదేముంది. అందులోను రాజులకు అందమైనదీ సువాసనగలదీ, నిత్యనూతన తేజంతో యోజనదూరం వరకు తన పరిమళాన్ని వెదజల్లే పుష్పం అంటే ఎందుకిష్టం ఉండదూ ! ఆయన వెంటనే తన భటులను పంపి, మిగిలిన సంగతులన్నీ తర్వాత చూద్దాం ముందా పుష్పాన్ని తీసుకురండని ఆజ్ఞాపించటంతో ఆవేశ్యకు పుష్పాన్నివ్వక తప్పిందికాదు. ఈ రాజసభకు ఆయనే ఆ పుష్పాన్ని తీసుకువచ్చారు. ..
అపుడు చంద్రవర్మ మహారాజుగారు లేచి " సభికులారా ! మన మందరం ఈ అద్భుతఫలపుష్పాలను గురించి విన్నాం. అశ్వారూఢుడైన పురుష పుంగవుడొకడు ఈ ఫలమిచ్చాడని ఒకరు, దేవకన్యలాంటి అప్సరస్త్రీ పుష్పాన్నిచ్చిందని మరొకరు అంటున్నారు. నాకీ విషయంలో కొంత సందేహం పొడసూపుతున్నది. సువాసనగల పుష్పాలను, వింతవస్తువులను భద్రపరుచుకొనేది సహజంగా స్త్రీలే ! కావున ఈ రెండింటినీ ఇచ్చినదీ స్త్రీయే అయిఉంటుందని నా భావన.
"సరే ! అయితే విచారణ ప్రారంభించండి” అని ధర్మాంగద మహారాజు అనే సరికి " ఓయీ ! బ్రాహ్మణుడా ! నీకు ఫలమిచ్చానంటున్న ఆ వ్యక్తి రూపు రేఖలను వర్తించగలవా ! ఆ వ్యక్తినొకమారు గుర్తు తెచ్చుకో ! అన్నాడు.
అయ్యా ! అపుడంతా కనుచీకటిగా ఉంది. నేను ఆ వ్యక్తిని నిశితంగా చూడలేదు. మగవేషమే మరి! పైగా గుర్రాన్నధిరోహించాడు. కావున మగవాడనే అనుకొన్నాను. కాని మీరిప్పుడడిగితే గుర్తుకొస్తోంది. అదేమిటంటే మూట విప్పుతున్న ప్పుడది పైట చెంగులాగే ఉంది. కొంగుముడి కనపడింది. అన్నాడు.
చంద్రవర్మ మరల అందుకొని అద్భుత ఫలాలు, పుష్పాలు, అరుదైన వింత వస్తువులు భద్రంగా దాచుకొనేది స్త్రీలే! కావున ఆ రెండింటిని ఇచ్చినది స్త్రీయేగాని పురుషుడు కాడు. ఈ విలువైన ఆరుదైన వస్తువులు మహారాజులు మున్నగువారి వద్ద ఉంటేనే శ్రేయస్కరము కాని సామాన్యులవద్దనుండరాదు. పుష్పాన్ని వేశ్య కర్పించిన సంఘటనలో మిత్రులిద్దరూ ఎలా మరణించారో విన్నాంకదా ! ఈ అరుదైన ఫలపుష్పాలు రాజులవద్దే ఉండనీయండి. ప్రతిగా ఈ బ్రాహ్మణులిద్దరికి తగిన పారితోషకాలనిప్పించండి అంటూ ముగించాడు.
సభికులందరూ “అట్లే' అని అంగీకరించారు. తదుపరి మణిమంజరి నాట్యం ఉంటుంది. తిలకించి వెళ్ళండి అని ప్రకటించారు.
ఒక ఎత్తైన వేదికపై మణిమంజరి వీణాగానం చేయసాగింది. వీణపై పలురకాల కీర్తనలు పాటలు పాడింది. సంగీత ప్రియులకు వారితోబాటు పాడాలని లయబద్దంగా తాళంవేయాలని అనిపిస్తుంది కదా ! వీణాగాన మాధుర్యానికి సంతసించిన, పురుషవేషంలోనున్న, విశాలాక్షికూడా ఆడి పాడి నాట్యం చేయాలనుకొంది. వెంటనే నిర్వాహకులతో" అయ్యా ! నాకుకూడా సంగీతంలో ప్రవేశముంది నేనుకూడా వీణ వాయించగలను, పాటలు కీర్తనలు పాడగలను. మీరు నాకొక అవకాశమిస్తే సద్వినియోగపర్చుకుంటాను. నా గానవిద్యా మాధుర్యాన్ని కూడా గ్రోలి నన్నానందింపచేయండి.” అని కోరింది. నిర్వాహకు లందుకు అంగీకరించి విశాలాక్షికి కూడా ఒక వీణనిప్పించారు. విశాలాక్షి వీణా గానం చేస్తూ వీణావతి ఉద్యానవనంలో చేసిన గానాన్ని అందుకుంది ఆ గానమాధు ర్యానికి సభికులందరూ మంత్రముగ్ధులయ్యారు. కొందరు కలిసిపాడారు. మరి కొందరు లయబద్దంగా నాట్యం చేయసాగారు. సభ అంతా కరతాళధ్వనులతోను, ప్రశంశలతోను నిండిపోయింది. దేవగానంతో శ్రావ్యంగా పాడిన పురుషవేషంలో నున్న విశాలక్షిని అభినందించకుండా ఉండలేకపోయారు.
ఆ గానమాధుర్యానికి అచ్చెరువొందిన కొందరు ఈతడెవరో తుంబురుడో లేక నారధుడో అయిఉంటాడనుకొన్నారు. మణిమంజరికూడా ఆ గానమాధు ర్యానికి అచ్చెరువొందింది.
ధర్మాంగదుడు చంద్రవర్మ రాజులు తమలో తామేదో ముచ్చటించుకొని” రాకుమారా ! 'నీగానం కడుశ్లాఘనీయమైంది. మానవమాత్రులెవరూ ఇంత అద్భుతంగా, శ్రావ్యంగా పాడలేరు. నీ రూపలావణ్యములు, నీ గాన మాధుర్యాన్ని విని మేమెంతో పరవశించిపోయాము. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలము. ఈ రాజ్యమంతా ఇచ్చినా సరిపోదే ! అంతటి అద్భుత శ్రావ్యంగా పాడిననీకు ఈ అద్భుతమైన ఫలపుష్పములను బహూకరిస్తున్నాము. అంగీకరించమని ఆ అద్భుత ఫలపుష్పాలు రెండింటినీ ఇచ్చివేసారు. మీకభ్యంతరం లేకపోతే మావిలాస మందిరంలో అతిధిగా కొన్నాళ్ళుండి తమ గానమాధుర్యంతో మమ్ములను తరింపచేయండి" అని పురుషరూపంలోనున్న విశాలాక్షినడిగారు.
విశాలాక్షి అందులకంగీకరిస్తూ "మరి ఈ బ్రాహ్మణుల మాటేమిటి'? అని అడిగింది. వెంటనే బ్రాహ్మణులిద్దరికీ చెరొక అగ్రహారమునిచ్చి సుఖశాంతులతో వర్ధిల్లండని చెప్పి పంపివేసారు. రాకుమారునిరూపంలోనున్న విశాలాక్షి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ తన గానమాధుర్యంతో రాజును రంజింప చేస్తూ కొన్నిరోజులు సుఖంగా కాలక్షేపం చేసింది. అతిధి మర్యాదలతో అత్యంత వైభవంగా వర్ధిల్లుతున్న విశాలాక్షి ఒకనాడు ఫలపుష్పాలను, రెండింటిని ముందుంచుకొని ఏకాంతంగా గానం చేస్తున్న సమయంలో ఎక్కడనుండియో ఒక చిలుకవచ్చివాలింది. ఆ చిలుకొక సందేశాన్ని పురుషరూపంలోనున్న విశాలాక్షికి అందించింది. దాన్ని విప్పి చదివినవిశాలాక్షి విస్తుబోయింది. ఆశ్చర్య పడసాగింది. అయోమయంలో పడిపోయింది. ఊహకందని ఈ వింతలేఖ ఏమిటి? నేనిపుడేం చేయాలి ? విశాలాక్షి మస్తిష్కంనిండా రకరకాల ఆలోచనలు. ఈ గండం ఎట్లా గట్టెక్కుతుందో తెలియక తికమకపడసాగింది.
COMMENTS