Kasi Majili Kathalu in Telugu Language : In this article read "కాశీ మజిలీ కథలు", " Kasi Majili Stories in Telugu" for kids and Students.
Kasi Majili Kathalu in Telugu Language : In this article read "కాశీ మజిలీ కథలు", " Kasi Majili Stories in Telugu" for kids and Students.
కాశీ మజిలీ కథలు Kasi Majili Kathalu in Telugu
మీరుతున్నా, యుక్తవయసుకు వసముతో వేశ్యాలోలుడై, వాడుకాదు. పెద్దలు, పూర్వం మగదదేశంలో సోమశర్మ, కాంతిమతియనే శ్రోత్రీయ బ్రాహ్మణ దంపతులుండేవారు. వారు పరమనిష్టాగరిష్టులు, సదాచార సంపన్నులై నిత్యము దైవభక్తి పరాయణులై ఉండేవారు.
సోమశర్మ సకల శాస్త్ర విద్యాపారంగతుడు, వేదవేదాంగ కోవిదుడు బహు ముఖ ప్రజ్ఞాశాలి. ఈతడు తన ప్రతిభాపాటవాలతో రాజులనెందరినో మెప్పించి, ధన,కనక,వస్తు వాహనాది సత్కారముల నెన్నింటినో అందుకొన్న అత్యంత పాండితీ ప్రకండుడు. అమిత ధనవంతుడై చుట్టుప్రక్కల గ్రామాలన్నింటికి అపర కుబేరుడుగా వర్దిల్లసాగాడు. తాను సంపాదించిన సంపదతో కొంత దానధర్మాలకు వెచ్చిస్తూ అపర దాన కర్ణుడుగా వెలుగొందసాగాడు. సద్గుణ సంపన్నయై, నిగర్వియై పలువురి ప్రశంశలతో భాసిల్లసాగాడు. ఆ
ఆతని భార్య కాంతిమతి. జాలి, కరుణ, దయాదాక్షిణ్యాలుగల దొడ్డఇల్లాలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. పతియే ప్రత్యక్ష దైవమనినమ్మిన పతివ్రతా శిరో మణి, అన్నదానసంతర్పణలుచేస్తూ అందరినాలుకలలో అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కింది.
అయితే పుత్రులు లేకపోవటమే ఆ దంపతులకు తీరనిలోటు. ఆ దంపతులు దర్శించనిపుణ్యక్షేత్రాలుగాని, మొక్కనిదేవుళ్ళుగాని లేరు. పుత్ర సంతతికోసం చేయని పూజాది వ్రతాలు లేవు. ఎంతకాలానికి సంతానం కలుగకపోయేసరికి వారి జీవితాలలో విషాదం అలుముకొంది. నిత్యంరాత్రయ్యేసరికి పుత్రులు లేరనే బాధతో క్రుంగిపోయేవారు. ఎప్పటికైనా పిల్లలుకలుగకపోతారా ! యనే ఆశతోనే ఆ వృద్ద దంపతులు జీవించసాగారు.
అయితే కాలం ఎల్లప్పుడు ఒకేలా ఉండదుగదా ! వారు చేసిన పూజలు వ్రతాలు, దానధర్మాల పుణ్యఫలముగా ఎట్టకేలకు కాంతిమతిగర్భంధరించింది. ఆ వృద్ధదంపతుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. భగవంతుడిన్నాళ్ళకు తమను కరుణించాడా! యని ఎంతగానో సంతోషించారు. ఎట్టకేలకు కాంతిమతి పండంటి బిడ్డను కన్నది. సోమశర్మ సుతుని చూసుకొని మురిసిపోయాడు. లేక లేకకలిగినపుత్రుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. బాలుడుదినదిన ప్రవర్త మానయై భాసిల్లసాగాడు.
సోమశర్మ కాంతిమతి దంపతులు ఒక శుభముహూర్తాన ఆ బాలునికి గుణసాగరుడు అని నామకరణం చేసారు. అత్యంత గారాబంగా అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.
కాలచక్రం ఎవరికోసమూ ఆగదు కదా ! చూస్తుండగానే గిర్రున అయిదు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. గుణసాగరునికి అత్యంత వైభవంగా అక్షరాభ్యాసం చేయించారు. తన పుత్రుడు తనకంటే గొప్ప వాడవ్వాలనీ, పరిపూర్ణ విద్యావంతుడవ్వాలనీ ఎనలేని కీర్తి ప్రతిష్టలనందుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నాడు.
కాని గుణసాగరుడు "పండితపుత్ర పరమ శుంఠః” అనే సామెతను ఋజువు చేస్తు ఆటపాటలలో మునిగితేలుతూ అల్లరి చిల్లరగా తిరుగుతూ, పోకిరిగా తయార య్యాడు. పెంపకలోపంవల్లను, అతిగారాబంవల్లను ఆతడుజులాయిగా మారి చెడు తిరుగుళ్ళుతిరగసాగాడు. ఒకవైపు వృద్ధదంపతులైన తన తల్లిదండ్రులకు వయసు మీరుతున్నా, యుక్తవయస్కుడైన గుణసాగరుడు ఏనాడు ఒక్కక్షణమైనా ఇంటిపట్టున ఉండేవాడుకాడు. మద్రసానవసముతో వేశ్యాలోలుడై, దుష్టమిత్రులతో నిత్యము కాలంగడిపేవాడు ఎవరెన్నిరకాలుగా చెప్పిచూసినా వినేవాడుకాదు. పెద్దలు, బంధువులు, చివరకు తల్లిదండ్రుల మాటలను గూడా లక్ష్యపెట్టేవాడుకాడు.
సోమశర్మ కాంతిమతీ దంపతులకు గుణసాగరుడొక తలనొప్పిగా మారాడు. వారనుకొన్నదొకటి జరిగినదొకటి పుత్రుడు పున్నామనరకం నుండి బయటపడవేస్తా డనుకొన్నారు. తనుఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడతాడనుకొన్నారు. కాని విధికడువిచిత్రమైనది. అనుకున్నవిజరుగక అనుకోనివి జరుగుటయేకదావిధిలీల!
తనయునిపట్ల తీవ్ర మనస్తాపంతో కృంగిపోతున్న వారింటి కొకనాడొక బంధువువచ్చి సర్వమూ తెలుసుకొని శర్మా! దిగులుపడకు! కాలమే దీనికి బదులు చెప్తుంది. నీ పిల్లవానికి చక్కని చుక్కను దెచ్చివివాహం జరిపించు. పెండ్లితోనైనా నీ పుత్రుడు బాగుపడగలడేమో ! అని ఉచిత సలహానొకదానినిచ్చి నిష్క్రమించాడు. సోమశర్మ ఆలోచనలో పడ్డాడు. నిజమే! పెండ్లి అయిన తర్వాత మంచిగా మారిన వారెందరులేరు అని అనుకొని గుణసాగరునికి వివాహం చేయ నిశ్చయించాడు. అయితే గుణసాగరుని గురించి తెలియని దెవ్వరికి! ఆతని చెడు తిరుగుళ్ళు, దుర్వ్యసనాలు సర్వులకూ విదితమే ! అట్లాంటివాడికి చూసి చూసి పిల్లనెవరిస్తారు?
పుత్రునికి పెండ్లి చేయటానికి సోమశర్మ పడనిపాట్లులేవు. దుష్టుడుగా, ధూర్తుడుగా అన్ని దుర్వ్యసనాలకు అలవాటు పడిన గుణసాగరునికి
పిల్లనివ్వటాన్ని ఎవరూ ముందుకు రాలేదు. ఇంకలాభంలేదనుకొన్న సోమశర్మ ఎక్కడో సుదూరప్రాంతం నుండి ఒక కన్యను దెచ్చిగుణసాగరునితో వివాహం జరిపించాడు. గుణసాగరుని గుణగణాలు తెలియని ఆ కన్యకు త్వరలోనే అంతా తెలిసింది. కాని ఏంచేయగలదు? తన మంచితనంతో భర్తనుమార్చాలని, మంచివాడిగా చెయ్యాలని సర్వవిధాలా ప్రయత్నించింది. కాని ఆమె ప్రయత్నమంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇంకచేసేదేమీలేక కాలాన్నే నమ్ముకొని అత్తవారింట మెలగసాగింది.
వివాహమైనా సరే గుణసాగరుడు తన దుర్వ్యసనాలను మానుకోలేదు. చక్కనిచుక్కలాంటి భార్య ఇంట్లో ఉన్నాసరే వ్యభిచారియైత్రాగుబోతులై చెడు తిరుగుళ్ళు తిరుగుతూ జులాయిగా, పోకిరిగా తయారై కన్నతల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను అది తెమ్మని, ఇది తెమ్మని హింసించసాగాడు. కూర్చొనితింటే కొండలైనా తరుగుతాయన్నట్లు క్రమేపి ధనధాన్యసంపదలన్నీ అంతరించిపో సాగాయి. ఇంట్లో ఉన్న నగలు, నాణేలు, విలువైన కనకాభరణాలు, సర్వమూ వారకాంతలపాలయ్యాయి. వేశ్యలవలలో చిక్కిన వాడికి ఎంత డబ్బైనా సరిపోతుందా! సరిపోదు. అందుచే బలవంతంగా భార్యమెడలోని నగలను, తల్లిదండ్రులనగలను తెగనమ్మేశాడు. ఇంకా ఇంకా ధనం కావాలని హింసించేవాడు. పాపం ! ఎక్కడి నుంచో తనభర్తనే నమ్ముకొని వచ్చిన ఆ కన్య చిక్కిశల్యమైంది. మనస్థాపంతో తల్లిదండ్రులు, కోడలూ తెగమధన పడిపోయేవారు.
ఇలా ఉండగా ఒకనాడు వారింటికి పిల్లనిచ్చిన బంధువొకాయన వచ్చాడు. పిల్లకాపురమెలా ఉందో చూడాలనుకొని వచ్చినవారికి ఇక్కడి పరిస్థితులన్నీ పూర్తిగా అవగతమయినాయి ఛావలేక బ్రతుకుతున్న తమపిల్లనెలాగైనా కాపాడుకోవాలన్న ధృఢనిశ్చయంతో సోమశర్మతో శర్మగారూ ! మీరెంతో మంచివారనీ, పేరు ప్రఖ్యాతులు గలవారనీ, పాండితీ ప్రకండులనీ, తమవంశమెంతో ఘనకీర్తికలదనీ ఎంచి మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చాం కాని మీరు మీ అబ్బాయి గుణగణాలను దాచిపెట్టి అన్యాయంగా మా అమ్మాయి గొంతుకోసారు. అయ్యా ! మేము మీకేం అపకారం చేసామని మీరిలా చేసారు. అన్యాయంగా అభం శుభం తెలియని అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటం భావ్యమా ! మీరు మోసం చేయటానికి మేమే దొరికామా! సర్లెండి! అయిందేదో అయిపోయింది. మీఅబ్బాయిమంచివాడుగామారి నప్పుడే అమ్మాయిని కాపురానికి పంపిస్తాం " అమ్మాయితో సహా వెళ్ళిపోయాడు. అవమానం భరించలేని సోమశర్మ” ఓరిదౌర్భాగ్యుడా ! మా కడుపున చెడబుట్టావు కదరా ! నిన్నా భగవంతుడు కూడా క్షమించడు. మేమింక ఈ అవమానాలతో జీవించటం కంటే మరణించటమే మేలు. అంటూ అక్కడికక్కడే ఉరిపోసుకొని ఆ వృద్ధదంపతులిద్దరూ మరణించారు.
ఈ హఠాత్పరిణామానికి గుణసాగరుడొకింత నిశ్చేష్టుడైనాడు. కన్నతల్లి దండ్రులు తనకళ్ళముందే గిలగిలాతన్నుకుంటూచనిపోతుంటే చూడలేక పోయాడు. అమ్మా! నాన్నా! నన్ను క్షమించండి. ధనగర్వంతో కన్నుమిన్నుగానక మంచిచెడులు మరచి మృగంలా ప్రవర్తించాను. ఇంకనేను ఏ తప్పుచేయనమ్మా !” అంటూ విలవిలా ఏడ్చాడు. ఎంత ఏడిస్తే ఏం లాభం ! పోయినవారు తిరిగిరారు కదా !
కన్నతల్లిదండ్రులు మరణించటంగుణసాగరుని హృదయాన్నికదలించి వేసింది. నిర్వేదంలో పడిపోయాడు. తన చేసిన పనులకు ప్రాయశ్చిత్తంలేదనుకొని చింతించసాగాడు. పైగానలుగురూనిందించటం అతన్నివేదనకు గురిచేసింది. తన జీవితం మీదతనకే విరక్తికలిగిఅంతవరకూ తను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడసాగాడు.
గుణసాగరుడికి ఏం చెయ్యాలో తోచలేదు. కన్నతల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నాడు. భార్యనుసరిగా చూడలేదు. ఏమొహంపెట్టుకుని మామగారింటికి వెళ్ళగలడు? అయినవాళ్ళందరూ అసహ్యించుకున్నారు. తానిప్పుడు ఘోర పాపాత్ముడు. నీచనికృష్ణుడు తనపట్ల జాలి చూపించేవారెవరుంటారు. తనుచేసిన పాపాలకు నిష్కృతి లేదను కొన్నాడు. ఏ పనిచేయటంరాదు పూలమ్మినచోట కట్టెలమ్మ లేరుగా ! పలు విధాలుగా పరితపించిన గుణసాగరుడు తనకికమరణమే శరణ్యమని ఎంచి ఆత్మహత్యకు పాల్పడబోయాడు. ఇంతలో కొందరు యాత్రికులు కాశికిపోతూ అబ్బాయీ ! ఆత్మహత్య మహాపాపం! సర్వపాపాలను హరించగల విశ్వేశ్వరుడు కాశిలో ఉన్నాడు. ఆ కాశీవిశ్వేశ్వరుని దర్శించి ముక్తిని పొందమని హితోపదేశం చేసారు.
గుణసాగరుడు వారు చెప్పినది విని ఊరిబయటనున్న నదిలోస్నానం చేసి శుచియై నదిఒడ్డున ఆలయంలోనున్న దేవుణ్ణి దర్శించి బయటకొచ్చాడు. అలా చింతాక్రాంతుడై పోతూ ఉన్న గుణసాగరునికి ఒకచోట ఒక స్వామి తనశిష్యులకు బోధనలు చేస్తూ కనిపించాడు.
వెంటనే ఆ స్వామిని దర్శించి “స్వామీ ! నేను ఘోర పాపాలను చేసాను కన్న తల్లిదండ్రులను కష్టపెట్టాను. కట్టుకున్న భార్యను కాదన్నాను. ధనమధంతో కన్ను మిన్నుగానక ప్రవర్తించాను. కడు దుష్టుడనైనాను స్వామి ! నా తల్లిదండ్రులు నన్ను విడిచి పై లోకాలకు వెళ్ళిపోయారు. కట్టుకున్న భార్య కాదన్నది. జీవితంపై విరక్తికలిగింది. ! నా పాపాలకు ప్రాయశ్చిత్తమే లేదా స్వామీ ! నన్ను కరుణించి, నాకేదైనా తరుణోపాయంచెప్పండి. బ్రతకాలనే కోరిక నశించిపోయింది. నాకేదైనా మార్గం చూపి పుణ్యం కట్టుకోండి” అంటూ స్వామి పాదాలపైబడి భోరు, భోరున విలపించాడు. స్వామి గుణసాగరుని ఓదార్చి “లే! నాయనా ! సర్వుల పాపాలను హరించే స్వామి ఆ కాశీవిశ్వనాధుడే ! మాతోపాటు నీవుకూడా వచ్చి కాశీవిశ్వేశ్వరుని దర్శించుకో ! సర్వపాప నివృత్తిచేసుకో ! " అంటూ గుణసాగరుని తన వెంట బెట్టు కొని కాశీకి ప్రయాణమైపోయాడు.
COMMENTS